‘ధర్మస్థల నియోజకవర్గం’ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ.. పీవీఆర్ సినిమాస్ ద్వారా థియేటర్లలోకి.. డేట్ ప్రకటించిన మేకర్స్!

20 Aug 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ.. పీవీఆర్ సినిమాస్ ద్వారా థియేటర్లలోకి.. డేట్ ప్రకటించిన మేకర్స్!

పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘ధర్మస్థల నియోజకవర్గం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. పీవీఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రెస్ మీట్‌లో చిత్రబృందం పాల్గొని సినిమా విశేషాలను పంచుకుంది.

సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ, “దర్శకుడు కథ చెప్పినప్పుడే ఈ సినిమాపై నమ్మకం ఏర్పడింది. నిర్మాణ సమయంలో క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. అనుకున్న స్థాయిలో అవుట్‌పుట్ రాకపోతే మళ్లీ షూట్ చేసి పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దారు. ఇందులో నేను ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటి కస్తూరి మాట్లాడుతూ, “ఇది కేవలం మైండ్‌లెస్ కామెడీ లేదా సాధారణ ఎమోషన్స్‌తో రూపొందిన సినిమా కాదు. ఒక మంచి ఆలోచన, బలమైన ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేటి Gen-Z ప్రేక్షకులు ప్రతి విషయాన్ని గమనిస్తూ, విశ్లేషిస్తూ సినిమాలను చూస్తున్నారు. అలాంటి ఆలోచనాత్మక యువతకు ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుంది” అని అన్నారు.

హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ, “గ్లామర్ పాత్రల కంటే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం. నా నటనను పూర్తిస్థాయిలో చూపించేందుకు అవకాశం ఇచ్చే అద్భుతమైన పాత్ర ఈ సినిమాలో లభించింది. ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ, “ఒక సినిమాను మొదలుపెట్టి, దాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంతో పెద్ద ప్రయాణం. సినిమా విడుదల అనేది బిడ్డకు జన్మనివ్వడంతో సమానమైన అనుభూతి. మా టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించింది. కథకు తగ్గట్టుగా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తెరకెక్కించాం. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తామనే నమ్మకం ఉంది” అన్నారు.

నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ, “సినిమా చూసిన వారి నుంచి ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం. పీవీఆర్ సినిమాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

పీవీఆర్ సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ కూడా చిత్రంపై నమ్మకం వ్యక్తం చేస్తూ, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

‘ధర్మస్థల నియోజకవర్గం’లో సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు, కస్తూరి, నటరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించగా, మేరుం భాస్కర్ నిర్మించారు. మహావీర్ ఏలేందర్ సంగీతం అందించగా, చంద్రబోస్ పాటలు రచించారు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న పీవీఆర్ సినిమాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

👍 Like & Share This Article
4 Likes

+